గుంటూరు అభివృద్ధే లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

  1. మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ – 2026-27
  2. నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
  3. ఏప్రిల్ 11న జరిగే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశం

గుంటూరు: గుంటూరు జిల్లాను సర్వతోముఖ అభివృద్ధి దిశగా నడిపించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని శంకరన్ కమిటీ హాల్‌లో మంత్రి అధ్యక్షతన “బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ – 2026-27” నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు..

ప్రణాళికాబద్ధ అభివృద్ధి: రాష్ట్ర బడ్జెట్ ఆమోదం నేపథ్యంలో ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు బడ్జెట్ ప్రయోజనాలు చేరాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని తెలిపారు. స్థానిక అవసరాలు, రంగాల ప్రాధాన్యతల ఆధారంగా నిధుల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు.

సమీక్షా సమావేశం: ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై జరగనున్న సమీక్షా సమావేశానికి ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పరిధిలోని ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముందుగా 7న జరగాల్సిన సమావేశం 11కి వాయిదా పడిందని తెలిపారు.

అధికారులకు దిశానిర్దేశం: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు అభినందనలు తెలుపుతూ, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. శాఖల వారీగా, మండలాల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

ప్రజా భాగస్వామ్యం: ప్రభుత్వ లక్ష్యాలు, బడ్జెట్ కేటాయింపులపై ప్రజలకు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అని, అందరూ కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎస్.ఎస్.కె. ఖాజావలి, నగర కమిషనర్ మయూర్ అశోక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.