హార్మూజ్ జలసంధి దాటి భారత్ చేరిన తొలి ఆయిల్ ట్యాంకర్

ముంబై: అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో కీలకమైన హార్మూజ్ జలసంధిని దాటి ఒక ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా భారత్ చేరింది. క్షిపణులు మరియు డ్రోన్ దాడుల భయాందోళనల మధ్య లైబీరియా జెండా కలిగిన “షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్” అనే చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరుకుంది.

ఈ ట్యాంకర్ మార్చి 1న సౌదీ అరేబియాలోని రాస్ తనురా పోర్టు నుంచి బయలుదేరింది. మొత్తం 1,35,335 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను భారత్‌కు తీసుకువచ్చింది. ముంబై పోర్ట్‌లోని జవహర్ ద్వీప్ టెర్మినల్ వద్ద ఈ ట్యాంకర్ సురక్షితంగా నిలిపివేయబడింది.

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కఠిన ఆంక్షలు విధించింది. తమ అనుమతి లేకుండా ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధి ఇరువైపులా అనేక ఆయిల్ ట్యాంకర్లు మరియు కార్గో నౌకలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన కొన్ని ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా “షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్” ట్యాంకర్ చాకచక్యంగా హార్మూజ్ జలసంధిని దాటి భారత్ చేరడం గమనార్హం.

దేశంలో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న సమయంలో ఈ ట్యాంకర్ సురక్షితంగా ముంబై చేరడం కొంత ఊరటను కలిగించింది. దీంతో భారత్‌కు క్రూడ్ ఆయిల్ సరఫరా కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.