వైసీపీ అధికారంలోకి వచ్చక అరాచకం అనే మాట తప్ప అభివృదిధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. అధికార దుర్వినియోగం, అందుకు
తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి
సమీపంలోని మద్దూరుపాడు జంక్షన్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ పై చేసిన దాడి చూస్తే వైసీపీ అరాచకం ఏ విధంగా పెచ్చరిల్లుతోందో
అర్థం అవుతోంది. రోడ్డుకి అడ్డంగా ఉన్న మోటార్ సైకిల్ తీయమని హారన్ మోగించడమే ఆ ఆర్టీసీ డ్రైవర్ చేసిన నేరమా? ఆ
బస్సును వెంబడించి మరీ విచక్షణరహితంగా దాడి చేయడం, ఆ అరాచకాన్ని చిత్రించినవారిని బెదిరించడం చేశారంటే... అలాంటి
గూండాలకు బలమైన అండ ఉండటమే కారణం అనిపిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసినవారిని కఠినంగా
శిక్షించాలి. ఈ ఘటనకు కారకులైనవారిని అరెస్టు చేయడంలో పోలీసులు చురుగ్గా స్పందించాలి. కేసును నీరుగార్చే ప్రయత్నం
చేస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ గూండా నాయకులు, కార్యకర్తలకు మద్దతుగా కొత్త
చట్టాలు చేస్తుందేమో అనే సందేహం ఉంది. మిగిలిన ఈ నాలుగు నెలల్లో- హారన్ కొట్టడం, సైకిల్ మీద తిరగడం, రోడ్డు మీద
నడవటం కూడా నేరాలుగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని శ్రీ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.