
పుంగనూరు పట్టణ యువత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రీడా మైదానం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ‘జనవాణి’ కార్యక్రమంలో యువత ప్రధానంగా క్రీడా మైదానం అవసరాన్ని ప్రస్తావించారు.
ఈ విజ్ఞప్తికి స్పందించిన పుంగనూరు జనసేన ఇంచార్జ్ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) రాష్ట్ర క్రీడా అసోసియేషన్ అధికారులతో చర్చలు జరిపారు. ఆయన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
మైదానం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించిన అనంతరం త్వరలోనే పూర్తి నివేదికను సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నా రాయల్ మాట్లాడుతూ యువత కోరిక నెరవేర్చడం తన బాధ్యతగా భావిస్తున్నానని, త్వరలోనే పుంగనూరు ఆటగాళ్లకు సొంత క్రీడా మైదానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.