
గుంటూరు : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గుంటూరులోని శ్రీనివాసరావుతోట శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం జనసేన నాయకులు సింధూర పూజ, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ, గత పదేళ్లుగా భుజం నొప్పిని భరిస్తూనే ప్రజల కోసం నిరంతరం శ్రమించిన పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపారు.
పోరాట యాత్ర, వారాహి యాత్రల సమయంలో భుజానికి తీవ్ర ఒత్తిడి పడటంతో శస్త్రచికిత్స అవసరమైందని పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ఆయన త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యంకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ప్రార్థనలు చేస్తున్నారని ఆళ్ళ హరి తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, దేవతల అనుగ్రహంతో ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆలయ ప్రధాన అర్చకులు కోగంటి పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో దేవస్థానం కార్యదర్శి తోట వెంకటేశ్వరరావు, మహిళా నాయకులు సరోజిని, సవరం రాజ్యలక్ష్మి, నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, షేక్ మెహబూబ్ బాషా, నాజర్ వలి, నండూరి స్వామి, పగిడిపోగు రమేష్, స్టూడియో బాలాజీ, జక్కా రాఘవులు తదితరులు పాల్గొన్నారు.