
తిరువూరు: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా ప్రజాజీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామంలోని ప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రం బాబా అతావుల్లా షా ఖాదరి దర్బార్ (ఏఏటిఎంకె దర్బార్ బాబే బాగ్దాద్)లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పవిత్ర చాదర్, గులాబీ పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు సమర్పించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దర్బార్ పీఠాధిపతి సూఫీ మహమ్మద్ ఖాజా మొహిద్దిన్ షా ఖాదరి మరియు మదీనా మజీద్ మాజీ ఇమామ్ మహమ్మద్ మక్కీ అష్రఫ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండల అధ్యక్షుడు లాకావతు విజయ్, గంపలగూడెం మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకట కృష్ణారావు, విసన్నపేట మండల అధ్యక్షుడు షేక్ యాసిన్, తిరువూరు మండల అధ్యక్షుడు పర్సా పుల్లారావు, పసుపులేటి మాధవరావు, కస్తూరి సీతారామస్వామి, వల్లారపు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ ప్రార్థనలో భాగమయ్యారు.
ప్రార్థన అనంతరం దర్బార్ వద్ద అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించగా, దర్బార్ వారసులు మహమ్మద్ ఖాజా మొహిద్దిన్ షాఖాదరీ, మహమ్మద్ జాఫర్ సాదిక్, మహమ్మద్ తాజ్ బొగ్దాధి, మహమ్మద్ ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మతసౌహార్దానికి నిదర్శనంగా నిలిచింది.