
పి.గన్నవరం నియోజకవర్గంలో రూ.17.67 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలోని ఉచ్చులవారిపేటలో 2.36 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.45 కోట్ల వ్యయంతో, పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి సంబంధించి శివాయలంకలో 1.60 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.37 కోట్ల వ్యయంతో, అలాగే పి.గన్నవరం మండలం నాగులంక గ్రామంలోని నామాడివారిపేటలో 1.20 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, పి.గన్నవరం నియోజకవర్గంలో ఏపీఆర్ఆర్ఎస్పీ పథకం కింద 16 రోడ్లు మంజూరు కాగా, మొత్తం రూ.17.67 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో, మంజూరైన రోడ్ల నిర్మాణ పనులకు దశలవారీగా శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు 80 శాతం రోడ్లను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన రోడ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అదేవిధంగా నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ వ్యవస్థను కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని తెలిపారు.
పి.గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.