
జీలుగుమిల్లిలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనుల పరిశీలన
జీలుగుమిల్లి, ఆగస్టు 25: జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిర్మాణం చివరి దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు మంగళవారం సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
అన్నా క్యాంటీన్ ప్రజలకు ఉపయోగకరమైన సేవా కేంద్రంగా మారనున్నందున, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.