
- మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పీలు జీవన, శివప్రియ
రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ని మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని వారి క్యాంపు కార్యాలయంలో నార్త్ జోన్, సౌత్ జోన్ డిఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నార్త్ జోన్ డిఎస్పీ సి.హెచ్. జీవన, సౌత్ జోన్ డిఎస్పీ ఏ. శివప్రియలు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలుపుతూ, విధి నిర్వహణలో పాటించాల్సిన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. నగరంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచాలని, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని మంత్రి సూచించారు.
ప్రజలతో మమేకమవుతూ, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానంలో బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో, సమర్థవంతంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు తమ పరిధిలోని భద్రతా అంశాలను మంత్రికి వివరించారు. చివరగా డిఎస్పీలకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.