
కడప జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కూటమి నాయకులు వై.యన్.పాళెం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ అర్జీ ఇవ్వబడింది.
టీ. సుండుపల్లి మండల పరిధిలోని బాహుదా నది పరివాహక ప్రాంతంలో 21.10.2025న ఇసుక రీచ్‌కు అనుమతులు ఇచ్చారని, అయితే ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా పెద్ద యంత్రాలతో విస్తృత స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. రోజుకు వందల ట్రిప్పుల టిప్పర్లతో ఇసుక తరలింపు జరుగుతోందని తెలిపారు.
ఈ అక్రమాలపై ప్రజలు ఇప్పటికే పలు దఫాలుగా నిరసనలు తెలిపినా తాత్కాలికంగా నిలిపివేసి మళ్లీ తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజిలెన్స్, మైనింగ్ అధికారులు పరిశీలన సమయంలో అక్రమాలు గుర్తించినప్పటికీ, వెంటనే తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి 40 నుండి 50 వేల మంది ప్రజలు తాగునీరు, సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల వలసలు తప్పవని హెచ్చరించారు.
కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసి, క్వారీని పూర్తిగా రద్దు చేసి ప్రజలను రక్షించాలని కూటమి నేతలు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.