పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఆదేశించారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆమె అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన రీతిలో న్యాయం అందించాలని సూచించారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పరిష్కరించిన అర్జీలు తిరిగి రీ-ఓపెన్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వెలుగొండ ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారానికి సంబంధించిన అర్జీలను నిబంధనలకు అనుగుణంగా, న్యాయబద్ధంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో మొత్తం 307 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 129, ఇతర శాఖలకు 49, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలకు సంబంధించి 129 అర్జీలు ఉన్నాయి.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.