
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నట్లు సమాచారం. పర్యటన ఖరారైతే దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెట్టినట్లవుతుంది. ఆయనతో పాటు చైనాకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ సోమవారం బీజింగ్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జరగనున్న భారత్-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు వివాదాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు వాంగ్ యీతో కూడా అజిత్ డోవల్ భేటీ కానున్నారు. షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు ముందు డోవల్ బీజింగ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్-చైనా సరిహద్దు అంశాలపై కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.