
గుంటూరు : భారతదేశపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగ వాహనం ‘విక్రమ్–1’ అభివృద్ధిలో లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్, ఏవియానిక్స్ వ్యవస్థల రూపకల్పనలో భాగస్వామ్యమైన యువ ఏవియానిక్స్ ఇంజనీర్ వూరిబండి రాయుడిని గుంటూరు నగర జనసేన నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గుంటూరు నగర జనసేన కార్యదర్శులు పావులూరి కోటేశ్వరరావు, తోట కార్తీక్ మాట్లాడుతూ, వూరిబండి రాయుడు భవిష్యత్తులో భారత అంతరిక్ష రంగానికి మరింత సేవలందిస్తూ, దేశానికి ఉపయోగపడే నూతన ఉపగ్రహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లాకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలని అభినందించారు.
వూరిబండి రాయుడు మాట్లాడుతూ, ఇస్రో (ISRO), ఇన్-స్పేస్ (IN-SPACe), POEM వంటి కార్యక్రమాల ద్వారా యువతకు అంతరిక్ష రంగంలో విశేష అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు కూడా ఉపగ్రహాలు, రాకెట్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని సూచించారు. చిన్ననాటి నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని, ‘విక్రమ్–1’ ప్రయోగం సందర్భంగా అభిమానిగా ప్రత్యేక టీ-షర్టుతో పాల్గొనడం ఆనందంగా అనిపించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు నగర జనసేన నాయకులు చందు భవాని శంకర్, శివచరణ్, చిరంజీవి, బావిరెడ్డి దుర్గ, వేలాద్రి తదితరులు పాల్గొని వూరిబండి రాయుడిని అభినందించారు.