
డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా అందజేత
కాకినాడ: కాకినాడ జిల్లా కరప మండలం జెడ్. భావవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సభ్య రైతు మినవల్లి త్రిమూర్తులు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, జనతా ప్రమాద బీమా పథకం కింద ఆయన కుటుంబానికి రూ.2 లక్షల బీమా క్లెయిమ్ మంజూరైంది.
గురువారం కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మృత రైతు నామినీకి రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం సహకార బ్యాంకులు అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వల్ప ప్రీమియంతో లభించే ప్రమాద బీమా పథకాలు ఆపద సమయంలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని చెప్పారు.
బీమా చెక్కు అందుకున్న మృత రైతు కుటుంబ సభ్యులు డీసీసీబీ యాజమాన్యానికి, చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కరప పీఏసీఎస్ అధ్యక్షుడు రెడ్డిపల్లి నారాయణరావు, జెడ్. భావవరం పీఏసీఎస్ అధ్యక్షుడు పసల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.