
అనంతపురం: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాయలసీమ పర్యటన సందర్భంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ తోట సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల జిల్లా చైర్మన్, డోన్ అసెంబ్లీ బీజేపీ యువ నాయకుడు కొట్టె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్–స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ కోసం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర, జిల్లా బృందాలు ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ అధికారులతో కలిసి అన్ని జిల్లాల్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రతినిధులతో కలిసి పట్టాభిరామ్‌ను కలసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సానిటరీ కార్మికుల పిల్లలకు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాల పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
స్వచ్ఛ సర్వేక్షణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పర్యావరణ పరిరక్షణ చర్యలపై చర్చించినట్లు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్–గ్రీన్ నంద్యాల లక్ష్యంగా తడి, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాలతో పాటు మొక్కల నాటే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, యువత, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.