
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్‌ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే తెలిపారు. శంకుస్థాపన అనంతరం మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ భారత డిజిటల్ పరివర్తనలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ డేటా సెంటర్‌తో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా వేగంగా ఎదుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వేలుగా నిలిచిన ముంబై, చెన్నై సరసన విశాఖ కూడా చేరనుందని స్పష్టం చేశారు. కొత్త ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లైన్లతో డిజిటల్ ట్రేడ్ మార్గాలు మరింత విస్తరించనున్నాయని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ అమలులో భాగస్వాములైన అదానీకాన్నెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశాఖను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మరింత బలోపేతం చేస్తూ, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, క్లౌడ్, ఏఐ టెక్నాలజీలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు 10 వేల మహిళలు మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లు స్థాపించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని వెల్లడించారు.
అలాగే, ఇంధన భద్రత కోసం కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని బికాస్ కోలే వివరించారు.