
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Google విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్తో కలిసి ఆయన ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.
దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ రూపురేఖలు మారడంతో పాటు, రాష్ట్రంలో టెక్నాలజీ రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు గూగుల్ ప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. నేటి భూమిపూజ కార్యక్రమం తర్లువాడలో ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. అనంతరం ఆయన సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.