
పి. గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఉడిమూడి, నరేంద్రపురం, వై.కొత్తపల్లి గ్రామాల్లో ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) పథకం కింద రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అందిస్తూ ఎన్నికల హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నరేంద్రపురం గ్రామ మహిళలు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో దాదాపు పదేళ్లుగా సీసీ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, తమ విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే వెంటనే నిధులు మంజూరు చేయించి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించినందుకు గ్రామ మహిళలు, గ్రామస్తులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.