
గుంటూరు లాడ్జి సెంటర్లో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖలో చేస్తున్న అభివృద్ధిని చూసి, ఓర్వ లేక కొంతమంది వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి వాళ్లకు నచ్చిన విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికే తాను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశానని తెలియజేశారు.
వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కు వచ్చిన వ్యతిరేకతను ఎలా సమర్థించుకోవాలో తెలియక, పాత బ్యాచ్ ని ఆపి, మరల కొత్త వాళ్లను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేయాలని విఫల యత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏకైక ఆకాంక్షతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ మీద చిన్న మాట కూడా మేము పడనివ్వమని, ఆయన మీద వేస్తున్న లేనిపోని నిందలకు అది చిన్నదైనా పెద్దదైన ప్రతిదానికి తాము స్పందిస్తామని అన్నారు.
ఇటీవల వైసిపికి చెందిన ఒక ఛానల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ అయ్యాయని, తర్వాత ఎప్పటికో మళ్ళీ రూరల్ లోకల్ బాడీస్ కి జమ చేశారని, వైసిపి నాయకులు అవగాహన రాహిత్యంతో లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. అలాంటి నిందలు వేస్తే అవి వైసిపి నాయకులకే చుట్టుకుంటాయని అన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు పవన్ కళ్యాణ్ జూన్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత డిసెంబర్ నెలలో డబ్బులు రావడం జరిగింది. అప్పటికే గత వైసిపి ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసిన యుటిలైజేషన్ సర్టిఫికెట్స్, గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఆడిట్ రిపోర్ట్స్, ఇ-గ్రామ స్వరాజ్ పోర్టల్ లో అప్లోడ్ చేయవలసిన డేటాను సుమారు 25 నుంచి 30% వరకు పెండింగ్లో ఉంచారని, పవన్ కళ్యాణ్ వాటన్నిటిని సరిచేసి, మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టి మరిన్ని నిధులు రాష్ట్రానికి తెచ్చే విధంగా చేసిన ప్రయత్నంలో భాగంగా జరిగిన జాప్యాన్ని వైసిపి నాయకులు వక్రీకరించి, వాళ్లు చేసిన తప్పులు చెప్పకుండా కేవలం ఈ విషయాన్ని మాత్రమే ప్రస్తావించటం వారి దురుద్దేశానికి నిదర్శనం అని అన్నారు. వారి మాటలను రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరని, కానీ వారు చేస్తున్న ఆరోపణలపై ప్రజలకు మరింత స్పష్టత వస్తే బాగుంటుందని ఉద్దేశంతోనే తాము ఈ విషయాలన్నీ వెల్లడిస్తున్నామని, అంతేగాని వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై కనీసం స్పందించాల్సిన అవసరం కూడా తమకు లేదని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో పంచాయతీలో కనీసం తట్టడు మట్టి కూడా వేసిన పాపాన వాళ్లు పోలేదని, పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసి, 15వ ఆర్థిక సంఘం నిధులను వారి ఇష్టానుసారంగా వాడుకొని, కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిన డాక్యుమెంట్లను పంపించకుండా, పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారు.
పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవస్థను మూలాల నుండి ప్రక్షాళన చేస్తూ, అప్పటికే వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన సర్పంచులు వైసిపి పార్టీకి సానుభూతిపరులు అయినప్పటికీ, వ్యవస్థ బతకాలి అనే సదుద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టి పంచాయతీ సర్పంచులు మరల ఇంతకుముందు లాగా కాలర్ ఎగరేసుకునే పరిస్థితి తీసుకు వచ్చింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు.
ఈ విషయం మీద సర్పంచ్ లను ఎదురుగా పెట్టి చర్చిద్దామా అని చాలెంజ్ చేశారు. పల్లె పండుగ పేరుతో గ్రామసభలు నిర్వహించి, ఆ గ్రామసభలలో గ్రామ ప్రజలందరూ కలిసి నిర్ణయం తీసుకున్న పనులన్నిటిని కూడా ఈరోజు గ్రామాలలో అమలయ్యే విధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పంచాయతీలో రోడ్లు పడటం కానీ, డ్రైనేజీ వ్యవస్థలు బాగు చేయటం గాని, అంతేకాకుండా ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అనే నానుడిని పవన్ కళ్యాణ్ అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి గానీ, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వినియోగం గురించి గానీ కనీసం మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు గానీ వారి పార్టీకి గాని లేదని చెప్పి విమర్శించారు. అందులో భాగంగా గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతి ఇంటికి నీరు అందాలి అనే ఉద్దేశంతో “జల జీవన్ మిషన్” పేరుతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ తో ఒక బృహత్తరమైన పథకాన్ని రూపొందిస్తే, దానిని కనీసం ఉపయోగించుకోవడం చేతగాక నిధులు అన్నిటిని నీళ్లపాలు చేసిన ఘనత గత వైసిపి ప్రభుత్వానిది అని అన్నారు.
2019- 24 మధ్యలో జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 14334.69 కోట్ల రూపాయల కేటాయిస్తే అందులో నుండి కేవలం 2,254.89 కోట్లు మాత్రమే వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రా చేసుకోగలిగారని, మరలా డ్రా చేసిన దాంట్లో 1,954 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఖర్చు చేసిన దానికి కూడా జలజీవన్ మిషన్ పథకం కింద ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా కాకుండా వారీ ఇష్టానుసారంగా ఖర్చు చేసి వాటికి కనీసం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా పరిపాలన సాగించిన ఘనత వైసిపి ది అని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024 తో ముగుస్తున్న జలజీవన్ మిషన్ ప్రాజెక్టు గురించి మరల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ పథకాన్ని 2028 వరకు పొడిగించే విధంగా ఒప్పించి మన రాష్ట్రానికే కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మేలు చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారని అన్నారు. పొడిగించడమే కాకుండా ఈరోజున రాష్ట్రంలో సుమారు 80,000 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి వాటన్నిటిని గ్రౌండ్ లెవెల్ లో అమలు అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి నీరు అందించాలనే ఆశయాన్ని పవన్ కళ్యాణ్ ఎంతో చిత్తశుద్ధితో చేస్తున్నారని అన్నారు. డబ్బులు ఇవ్వడం కాదు, అవి వైసిపి సరైన పద్ధతిలో సరైన పథకానికి సరైన విధంగా ఖర్చుపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తెచ్చి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే, వైసీపీ నాయకులకి నిద్ర పట్టడం లేదని అన్నారు.
గతంలో దేశంలో 23వ స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఈరోజున దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత పవన్ కళ్యాణ్ ది అని అన్నారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు 5 అవార్డులు కూడా ప్రకటించిన సంగతి దేశమంతా చూసిందని అన్నారు. అది చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ మీద లేనిపోని నిందలు వేస్తే అది తిరిగి వారికి అంటుకుంటుందని అన్నారు.
అలా కాకుండా పవన్ కళ్యాణ్ మీద లేనిపోని నిందలు వేసే ప్రయత్నం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలా కాని పక్షంలో దమ్ముంటే ఒక పంచాయతీరాజ్ శాఖ మీద కాదు రాష్ట్రంలో ఉన్న ఏ శాఖ మీదైనా సరే తాము చర్చకు సిద్ధమని, వైసిపి నాయకులు వారు ఇష్టమైన ప్లేస్ చెప్పి చర్చకు రమ్మంటే తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ మీద లేనిపోని నిందలు వేస్తే రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలబడి, జనసేన పార్టీ అభ్యర్థులు మరియు కూటమి అభ్యర్థులు అందర్నీ గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో పవన్ కళ్యాణ్ మరియు కూటమి ప్రభుత్వం నడిపిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, పట్టణ ఉపాధ్యక్షులు కొండూరు కిషోర్, మాజీ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి హుస్సేన్ మరియు తదితరులు పాల్గొన్నారు.