ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, జిల్లా మరియు క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ కొరత, ఎరువుల మళ్లింపులు, రైతుల్లో అనవసర ఆందోళనలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వివిధ పంటలకు అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, పంటల సరళి మరియు అంచనా డిమాండ్ ఆధారంగా మండల స్థాయిలో ముందస్తుగా ఎరువుల నిల్వలు ఉంచాలని సూచించారు. గత ఖరీఫ్ సీజన్‌లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

కృష్ణా, కాకినాడ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ (FFS) ద్వారా ఎరువుల బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, మిగతా 26 జిల్లాల్లో ఏపీఎఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఎరువుల పంపిణీ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

సీఎం కార్యదర్శి రాజమౌళి మాట్లాడుతూ, ఎరువుల మళ్లింపును అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ విశ్లేషణాత్మక నివేదికలు సమర్పించాలని, రైతుల సమస్యల పరిష్కారానికి రియల్‌టైమ్ గ్రీవెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాలకు (ఆర్‌ఎస్‌కేలు) లాగిన్ వివరాలు అందజేసినట్లు తెలిపారు. ఖరీఫ్-2025 ఈ-క్రాప్ బుకింగ్ పరిధిలో ఉన్న రైతుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. అన్ని ఎరువుల రిటైలర్లు, పీఏసీఎస్‌లను ఏపీఎఐఎంఎస్ 2.0లో నమోదు చేసి రైతు సేవా కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.

అన్ని వర్గాల రైతులు తమకు సమీపంలోని గుర్తింపు పొందిన రిటైలర్ల ద్వారా ఎరువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ఎరువుల కేటాయింపు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి రైతులకు పారదర్శకమైన, వేగవంతమైన ఎరువుల పంపిణీని నిర్ధారించాలని సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.