అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును నిలిపివేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను పలువురు రైతులు హైకోర్టులో సవాలు చేశారు. భూసేకరణ ప్రక్రియలో అధికారులు చట్టపరమైన నిబంధనలను పాటించలేదని, అందువల్ల నోటిఫికేషన్‌తో పాటు సంబంధిత ప్రక్రియను రద్దు చేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూసేకరణ ప్రక్రియ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతోందని కోర్టుకు వివరించారు.

ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో మంగళవారం తుది తీర్పు వెలువరించిన ధర్మాసనం రైతులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

విస్తృత ప్రజా ప్రయోజనాలే అత్యంత ప్రధానమని, ప్రజా ప్రయోజనాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేయలేమని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

హైకోర్టు తాజా తీర్పుతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన ఈ రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.