జనసేన కమిటీల నియామకానికి మరికొద్ది వారాల గడువు

మంగళగిరి: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు స్వీకరించిన దరఖాస్తులను ప్రత్యేక కమిటీ సభ్యులు గత కొద్ది రోజులుగా క్షుణ్ణంగా పరిశీలించి వివిధ కమిటీలకు సంబంధించిన జాబితాలను సిద్ధం చేశారు.

ఈ జాబితాను గురువారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తుల ఆధారంగా రూపొందించిన జాబితాలో కొన్ని మార్పులు, సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు.

ప్రతి దరఖాస్తును మరింత లోతుగా పరిశీలించి, అవసరమైన సవరణలు చేసిన అనంతరం జాబితాను మరోసారి సిద్ధం చేయాలని సంబంధిత కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు వారి కష్టం, అంకితభావానికి తగిన గుర్తింపు కల్పించడమే కమిటీల నియామక ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

కమిటీల ఎంపిక ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు మరికొద్ది వారాల సమయం అవసరమని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గడువును పొడిగిస్తూ, ఎప్పటికప్పుడు తనతో సమన్వయం చేసుకుంటూ, తాను సూచించిన సవరణలను అమలు చేసి జాబితాను మరోసారి సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత కమిటీ సభ్యులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.