
నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం ఉండ్రాజవరం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, 117 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. పర్యాటక మంత్రిగా తనకు లభించిన అవకాశంతో నిడదవోలు నియోజకవర్గాన్ని ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’లో చేర్చినట్లు చెప్పారు.
ప్రసిద్ధ కోట సత్తెమ్మ ఆలయంలో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రూ.3 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రానున్న స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఉండ్రాజవరంలో ఘనంగా తిరంగా ర్యాలీ
మండల నాయకుల సమావేశానికి ముందు ఉండ్రాజవరం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్‌కు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి జాతీయ జెండాను చేతబూని, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రజలు, నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తనకు అప్పగించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలకు బాధ్యతాయుతంగా న్యాయం చేస్తూనే, నిడదవోలు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు.