
విజయవాడ: పౌర సరఫరాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ కానూరులోని పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోలీసు శాఖ తరహాలో పౌర సరఫరాల సేవలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించే విధంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆలస్యాలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. కానూరు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక గదిలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు అందుతున్న పౌర సరఫరాల సేవలపై పూర్తి సమాచారం అందేలా కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానంగా ప్రత్యేక డ్యాష్‌బోర్డును రూపొందించనున్నట్లు తెలిపారు. శాఖలో పారదర్శకత, పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, మారుతున్న సాంకేతికతను వినియోగించుకుని సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రైతులకు అందుతున్న సేవలు ఉపయోగకరంగా ఉన్నాయని, రబీ సీజన్లో 67 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వాట్సాప్ ద్వారా షెడ్యూల్ చేయగలిగామని తెలిపారు. ఈ సేవలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
ఎల్నీనో ప్రభావంపై అప్రమత్తత
రానున్న రోజుల్లో ఎల్నీనో ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున రైతులను ముందుగానే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. సాగునీటి కంటే తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చని, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు.
ప్రభుత్వంపై నమ్మకంతో ఈ ఏడాది రైతులు అధికంగా పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు. ఏలూరు వంటి జిల్లాల్లో వర్షపాతం 74 శాతం తక్కువగా నమోదైనప్పటికీ, పంటల సాగు 400 శాతం అధికంగా ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతోనే జూన్ వరకు గడపాల్సిన పరిస్థితి రావచ్చని, ఈ అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
రవాణా ఛార్జీలను వెంటనే చెల్లించేలా చర్యలు
ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ధాన్యం రవాణా కోసం రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకునే వాహనాలకు సంబంధించిన చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవాణా ఛార్జీల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
గోతాల సమస్యను పరిష్కరించేందుకు పీపీ బ్యాగులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ కంటే ఆధునికమైన ఆర్ఎఫ్ఐడీ సాంకేతికతను ఈ సీజన్ నుంచే వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, ఎండీ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.