
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ బసంత్ కుమార్ మేఘ్వాల్ చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పురుషుల హైజంప్ ఈవెంట్లో 2.21 మీటర్ల ఎత్తును విజయవంతంగా అధిగమించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా బసంత్ చరిత్ర సృష్టించాడు.
పోటీలో 19 ఏళ్ల బసంత్ కుమార్తో పాటు అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచి, బ్రిటన్కు చెందిన ఓటిస్ పూల్ కూడా 2.21 మీటర్ల ఎత్తును క్లియర్ చేశారు. అనంతరం 2.24 మీటర్ల ఎత్తును అధిగమించే ప్రయత్నంలో ముగ్గురూ విఫలమయ్యారు. దీంతో ‘కౌంట్బ్యాక్’ నిబంధన ఆధారంగా విజేతలను నిర్ణయించారు.
తక్కువ ప్రయత్నాల్లో లక్ష్యాన్ని చేరుకున్న అల్జీరియా అథ్లెట్ యూనెస్ అయాచికి స్వర్ణ పతకం దక్కగా, బసంత్ కుమార్ మేఘ్వాల్ రజతం, బ్రిటన్కు చెందిన ఓటిస్ పూల్ కాంస్య పతకం సాధించారు.
జాతీయ రికార్డు హోల్డర్ సహానా కుమారి పర్యవేక్షణలో బసంత్ శిక్షణ పొందుతున్నాడు. గతంలో అతని అత్యుత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా, తాజా ఛాంపియన్షిప్లో 10 సెంటీమీటర్ల మేర మెరుగుపరుచుకుని 2.21 మీటర్ల ఎత్తును అందుకోవడం విశేషం.