
మంగళగిరి: విజయవాడ–మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రెండో రోజు జనవాణి కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపాలనే లక్ష్యంతో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకత్వాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, ప్రతి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకునేలా వినతిపత్రాలను ఫార్వర్డ్ చేసినట్లు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రతి అర్జీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు.