
* దశాబ్దాల నుంచి నెలకొన్న మానవ–ఏనుగు సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్
* ఆధునిక సాంకేతికతతో మన్యంలో అటవీ ఏనుగుల సమస్యకు పరిష్కారం
* రైతుల పంటలు, ప్రజల ప్రాణాల రక్షణకు కీలక ముందడుగు
* గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ–ఏనుగు సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
అడవి ఏనుగుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, గ్రామాల్లోకి ప్రవేశించే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతాలకు మళ్లించడం, రైతుల పంటలు, ప్రజల ప్రాణాలను రక్షించడం ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మానవ–ఏనుగు సంఘర్షణలకు ఇది శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, అనంతరం ప్రభుత్వ స్థాయిలో చర్యలు చేపట్టి గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగుల సంచారాన్ని నియంత్రించి, ప్రాణనష్టం, పంటనష్టాన్ని తగ్గించడమే లక్ష్యమన్నారు.
గతంలో పలమనేరు ప్రాంతంలో కుంకీ ఏనుగుల సహాయంతో నిర్వహించిన చర్యల వల్ల మానవ–ఏనుగు సంఘర్షణల కారణంగా జరిగే మరణాలు, పంట నష్టాలు గణనీయంగా తగ్గిన విషయాన్ని ప్రస్తావించారు. అదే తరహా ఫలితాలు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, ప్రజలు నాలుగు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అందించడం పట్ల పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె. అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోనెల విజయ్ చంద్ర, నిమ్మక జయకృష్ణ, శాసనసభ విప్ తోయక జగదీశ్వరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.