
గోదావరి పుష్కరాలపై నరసాపురంలో సమీక్ష.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
నరసాపురం: నరసాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా మంజూరయ్యే నిధులకు సంబంధించిన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలో వంద శాతం మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పార్కుల ఆధునికీకరణ, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
అలాగే, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అమృత్ 2.0 పథకం కింద రూ.125.64 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో, కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు.
పుష్కరాల దృష్ట్యా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షలతో ఘాట్లకు అనుసంధానంగా ఉన్న రహదారులను పునర్నిర్మించాలని సూచించారు. అలాగే మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ సహకారంతో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
పుష్కరాల నాటికి నరసాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని బొమ్మిడి నాయకర్ అధికారులకు సూచించారు.