గల్లంతైన మత్స్యకారుల కోసం విస్తృత గాలింపు చేపట్టాలి: పవన్ కళ్యాణ్

విశాఖపట్నం: విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు, గాలింపు చర్యల పురోగతిని తెలుసుకున్నారు.

ఈ నెల 1వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణం ప్రారంభించినప్పటికీ, తీరానికి చేరుకునే సమయంలో వారి ఆచూకీ తెలియకుండా పోయిందని కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు మెరైన్ పోలీసులు, కోస్టుగార్డు, నేవీ సమన్వయంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఇప్పటికే నేవీ హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.