

జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా నిర్వహించిన సమావేశంలో వి.ఆర్.పురం మండల జనసేన అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎమ్మెల్సీ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు జనసేన అండగా ఉంటుందని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించిన ఈ కార్యక్రమం కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు అందించే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామని, రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ, పార్టీలోని వివిధ బాధ్యతల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు. అలాగే పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ముంపు మండలాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వీర మహిళ మండల ఉపాధ్యక్షురాలు బాగుల ప్రమీళా రాణి, మండల ఉపాధ్యక్షుడు కనుగుల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి బాగుల అంజనరావు, సీనియర్ నాయకుడు మాదిరెడ్డి శ్రీనివాస్, యువ నాయకుడు పెడపెట్ల పవన్ కళ్యాణ్, సహాయ కార్యదర్శులు ముంజపు శ్రీరామ్, మాచర్ల వేణుబాబు, మాదిరెడ్డి బోసు, కొత్తూరి శేషు, గూటాల సమ్మరాజు, కెచ్చల పోసిరెడ్డి, కోట్ల రామ్మోహన్ రెడ్డి, అందెల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.