
- తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- ప్రత్యేక ఆకర్షణగా డ్రెయిన్ నమూనా ప్రదర్శన
రైల్వే కోడూరు: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కలిసి తొలి కార్యక్రమంగా ఫారం పాండ్‌కు శంకుస్థాపన చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించే ఈ కార్యక్రమంలో భాగంగా పంటకుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం టేకు, మద్ది, వేప, యూకలిప్టస్ తదితర 10 రకాల కలప ఉత్పత్తి చేసే మొక్కలను నాయకులు నాటారు. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణతో పాటు పంచాయతీల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కలప ఉత్పత్తి, వుడ్ బ్యాంకుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణను పవన్ కళ్యాణ్ వివరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రెయిన్ నమూనాను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చూపించి దాని నిర్మాణం, పనితీరును అధికారులు వివరించారు. మురుగునీటి నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఈ వినూత్న నమూనాలో మూడు లేయర్ల నిర్మాణ విధానాన్ని ప్రదర్శించారు.
అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీని అతిథులు సందర్శించారు. మోడల్ పంచాయతీలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలు, జియో ట్యాగింగ్ వంటి పారదర్శక విధానాలను పరిశీలించారు. కార్యక్రమంలో వీబీ జీ రాం జీ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. అలాగే ఓపీఈడీ బుక్‌లెట్‌ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించగా, సంబంధిత పోర్టల్‌ను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు కమలేష్ పాశ్వాన్, డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.