‘షైనింగ్ స్టార్స్’లో మెరిసిన విద్యార్థుల కలలు.. సూచనలకు మంత్రి లోకేశ్ ప్రశంస

పదవ, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవం విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆశయాలు, కృతజ్ఞతలు, విద్యావ్యవస్థపై సూచనలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాల్ బోర్డులపై పంచుకున్నారు.

కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ‘డ్రీమ్ వాల్’, ‘గ్రాటిట్యూడ్ వాల్’, ‘సజెషన్ వాల్’లను మంత్రి లోకేశ్ ఆసక్తిగా పరిశీలించి, ప్రతి విద్యార్థి రాసిన అభిప్రాయాన్ని చదివారు. ‘డ్రీమ్ వాల్’పై పలువురు విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. మన్యం జిల్లాకు చెందిన ఎన్. మౌనిక వైద్యురాలిగా మారి పేదలకు సేవ చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేయగా, కాకినాడ జిల్లాకు చెందిన డి. చిన్నారి చార్టర్డ్ అకౌంటెంట్‌గా దేశానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. మరో విద్యార్థి ఎస్. శివరామకృష్ణ ఐఏఎస్ అధికారి, అనంతరం పాఠశాల విద్య కమిషనర్‌గా పనిచేసి విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాలనే తన కలను పంచుకున్నారు.

‘గ్రాటిట్యూడ్ వాల్’పై ప్రభుత్వం అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమంపై విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

‘సజెషన్ వాల్’ ద్వారా విద్యార్థులు విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై పలు సూచనలు చేశారు. బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ, పాఠశాలల్లో ఐఐటీ సిలబస్, కంప్యూటర్ బేసిక్స్ బోధన, క్రీడా మైదానాల ఏర్పాటు, విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే చర్యలు, ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.

విద్యార్థుల ఆలోచనలు, సూచనలను అభినందించిన మంత్రి నారా లోకేశ్, వాటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల అభిప్రాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.