
- ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరులోని బావిశెట్టి వారి పేట, అల్లూరి సీతారామరాజు కాలనీలో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ జీర్ణోద్ధరణ మరియు శిఖర ప్రతిష్ట మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు లక్కోజు లక్ష్మణ వెంకట దుర్గాప్రసాద్ శర్మ ఆహ్వానం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, పంచగవ్య ప్రాశనం, సర్వతోభద్ర మండల ఆవాహన, అగ్ని ప్రతిష్ట, ఆలయ ప్రవేశం, వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు పర్వాగ్నికరణ, శిఖర ప్రతిష్ట, పూర్ణాహుతి వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ లోకకల్యాణాన్ని ప్రసాదించే కనకదుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సుఖశాంతులు, అభివృద్ధి నెలకొనాలని ప్రార్థించారు.
ఈ మహోత్సవంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.