
అమలాపురంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డీఎల్డీఓ పి. విజయభాస్కర్ తెలిపారు. సోమవారం అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటర్ల జాబితా కచ్చితత్వం, పారదర్శకత, సమగ్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన సవరణ కార్యక్రమం జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈ కాలంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ అప్లికేషన్లను పంపిణీ చేస్తారని, ఓటర్లు వాటిలో అవసరమైన సమాచారాన్ని పూర్తిగా నమోదు చేసి సంబంధిత బీఎల్వోలకు తిరిగి అందజేయాలని సూచించారు.
2026 జూలై 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువత కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం పరిశీలన పూర్తిచేసి సెప్టెంబర్ 22 నాటికి తుది ఓటర్ల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.ఎస్. దివాకర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎస్. ఏలేశ్వరావు, విజయ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.