అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. మానవత్వానికి నిదర్శనమన్న బొబ్బేపల్లి సురేష్ నాయుడు

వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించడం మానవత్వానికి నిదర్శనమని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలతో పాటు అభిమానుల కష్టసుఖాల్లోనూ భాగస్వామిగా నిలుస్తారని పేర్కొన్నారు. నిరంజన్ తన అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూడాలనే కోరికను వ్యక్తం చేయగా, ఆ కోరికను నెరవేర్చేందుకు ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించడం గొప్ప విషయమని అన్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదమైన లడ్డూను నిరంజన్‌కు అందించి, అతనితో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు గుండెలకు హత్తుకుని ధైర్యం చెప్పారని తెలిపారు. బాధిత కుటుంబం జీవన పరిస్థితులను తెలుసుకుని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

వ్యాధిని పూర్తిగా నయం చేయడం ప్రతి సందర్భంలో సాధ్యం కాకపోయినా, బాధితులకు మనోధైర్యాన్ని అందించడం ఎంతో గొప్ప మానవీయ లక్షణమని, పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడని బొబ్బేపల్లి సురేష్ నాయుడు కొనియాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నానిపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నాయకుడి సేవలను విమర్శించడం కంటే, ఆయన చేస్తున్న మానవీయ కార్యక్రమాలను గుర్తించి గౌరవించాలని సూచించారు. ప్రజల పట్ల ప్రేమ, అభిమానుల పట్ల ఆప్యాయత, బాధిత కుటుంబాలకు అండగా నిలిచే గుణం పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేక నాయకుడిగా నిలబెడుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల నాయకుడు పోట్లూరు సుబ్రహ్మణ్యం, మనుబోలు మండల నాయకుడు శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.