
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కేర్ యూనిట్ వాహనాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కేర్ యూనిట్‌లో ఆరుగురు వైద్య, సాంకేతిక సిబ్బందితో పాటు 14 రకాల వైద్య పరీక్షలు, 57 రకాల ప్రాథమిక మందులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ మొబైల్ మెడికల్ యూనిట్‌ను రూపొందించామని తెలిపారు. నెలకు 20 గ్రామాలను కవర్ చేస్తూ, 22 రోజుల పాటు నిరంతరాయంగా సేవలు అందించేలా రాంకీ ఫౌండేషన్ ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను సమీకరిస్తూ గత ఏడాది నుంచి వైద్య సేవల విస్తరణకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే రెండు మెడికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, తాజాగా మరో వాహనాన్ని కూడా ప్రారంభించామని వివరించారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సామాజిక బాధ్యతలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.50 లక్షలు కోరగా, ఇప్పటికే రూ.30 లక్షల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. మిగిలిన సహాయాన్ని కూడా అందించేందుకు సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తోందని, సేవా కార్యక్రమాలకు ఆ సంస్థ నిరంతరం అండగా నిలుస్తోందని కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.