
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకాని కవిత తమ కుటుంబానికి చెందిన స్థల వివాదంపై న్యాయం చేయాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించారు.
ముతకాని కవిత తెలిపిన వివరాల ప్రకారం, ఆమె భర్త ముతకాని లక్ష్మీనారాయణ 2022 ఏప్రిల్ 8న అదే గ్రామానికి చెందిన చుండి మల్లికార్జున నుంచి సర్వే నంబర్ 361లో 184 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. ఆ స్థలాన్ని స్వాధీన అనుభవంలోకి తీసుకుని బేస్ మట్టం కూడా వేశామని, విక్రయ స్వాధీన అగ్రిమెంట్తో పాటు కొనుగోలు సమయంలో సాక్షులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
అయితే, తమ స్థలంపై ఎలాంటి హక్కులు లేని గ్రామానికి చెందిన మరో వ్యక్తి తన పలుకుబడి, ఆర్థిక బలాన్ని ఉపయోగించి తమను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో తమ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందని, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ను కలిసి తమ సమస్యను వివరించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన కనపర్తి మనోజ్ కుమార్, బాధిత కుటుంబం అందించిన పత్రాలు, ఆధారాలను పరిశీలించి, అవసరమైన విచారణ జరిపి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముతకాని కవిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, చట్టబద్ధమైన హక్కులను కాపాడేందుకు అన్ని విధాల సహకరిస్తామని స్పష్టం చేశారు.
బాధిత కుటుంబానికి మద్దతుగా జనసేన పార్టీ పొన్నలూరు మండల నాయకుడు పత్తిపాటి మాధవరావు కూడా నిలిచారని, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు పేర్కొన్నారు.