ఏపీకి జాతీయ అవార్డు.. మంత్రి కందుల దుర్గేష్‌కు జనసేన నేతల ఘన సత్కారం

నిడదవోలు : ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డు లభించిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను నిడదవోలు జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

కేరళలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించిన అనంతరం నిడదవోలుకు చేరుకున్న మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో జనసేన నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పర్యాటక శాఖలో మంత్రి కందుల దుర్గేష్ వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక రంగానికి ఆయన సరికొత్త దిశానిర్దేశం చేస్తూ అభివృద్ధి బాట పట్టించారని కొనియాడారు.

మంత్రి దుర్గేష్ కృషి, సమర్థవంతమైన కార్యాచరణ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించిందని, ఇది రాష్ట్ర ప్రజలతో పాటు నిడదవోలు నియోజకవర్గానికి కూడా గర్వకారణమని నాయకులు అభిప్రాయపడ్డారు.

తమను అభినందించిన జనసేన నాయకులకు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.