
హైదరాబాద్: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున కొలువుదీరింది. అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల కోరికను నెరవేర్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిల్పి డి. రాజ్‌కుమార్ ఉడయార్ రెండు నెలల పాటు శ్రమించి ఈ భారీ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించారు.
విగ్రహావిష్కరణ సభ నేపథ్యంలో మైత్రీవనం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు.
అమీర్‌పేట, సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వెంగళరావునగర్, కల్యాణ్‌నగర్ మార్గాల్లో మళ్లిస్తారు. సత్యం థియేటర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లేవారు పంజాగుట్ట మార్గాన్ని ఉపయోగించాలని సూచించారు. అలాగే యూసుఫ్‌గూడ నుంచి మైత్రీవనం వైపు వచ్చే వాహనాలను కృష్ణకాంత్ పార్క్ వైపు మళ్లించనున్నారు. ప్రయాణికులు ట్రాఫిక్ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.