తినే టైమ్ నుంచి నిద్ర వరకు.. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న 6 అలవాట్లు

భారతీయుల రోజువారీ జీవనశైలిపై బెంగళూరుకు చెందిన ప్రముఖ కోలొరెక్టల్ సర్జన్ డాక్టర్ పరమేశ్వర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చాలామంది తప్పు సమయాల్లో భోజనం చేస్తారు, సరైన సమయానికి నిద్రపోరు, నీళ్లు తక్కువగా తాగుతారు. ఇదే వారి డైలీ రొటీన్‌గా మారింది” అని ఆయన పేర్కొన్నారు. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, ఆధునిక జీవనశైలి ప్రేగుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వివరించారు.

ప్రస్తుతం బిజీ జీవితంలో ప్రజలు అలవాటు చేసుకున్న కొన్ని పొరపాట్లు జీర్ణవ్యవస్థ సమస్యలకు ప్రధాన కారణమవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా

1. అర్ధరాత్రి భోజనం: రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణంకాక, పులిసిపోతుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

2. అస్తవ్యస్త ఆహార వేళలు: ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయకపోవడం, కొన్నిసార్లు భోజనం మానేయడం వల్ల ప్రేగుల పనితీరు దెబ్బతిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి సమస్యలు వస్తాయి.

3. ప్రాసెస్డ్ ఫుడ్: రోజూ బిస్కెట్లు, చిప్స్, నూడుల్స్ వంటి ప్యాకెట్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.

4. నీరు తక్కువగా తాగడం: చాలామంది భారతీయులలో మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలకు శరీరంలో నీటిశాతం తక్కువగా ఉండటమే ప్రధాన కారణం.

5. ఫైబర్ లేని ఆహారం: మైదా, తెల్ల అన్నం ఎక్కువగా తీసుకుని, పీచుపదార్థాలు (ఫైబర్) ఉన్న కూరగాయలు, పండ్లు తినకపోవడం వల్ల వ్యర్థాలు ప్రేగులలో పేరుకుపోతాయి.

6. సరిగ్గా నిద్రపోకపోవడం: నిద్రలేమి వల్ల ప్రేగులలో వాపు (inflammation) పెరిగి, అసిడిటీ వంటి సమస్యలు తీవ్రమవుతాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ చిన్న చిన్న మంచి అలవాట్లు అలవర్చుకోవాలని డాక్టర్ పరమేశ్వర సూచించారు. రాత్రి 9 లోపు భోజనం చేయడం, రోజూ తగినంత నీరు తాగడం, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి ప్రేగుల ఆరోగ్యానికి చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు.

*గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.