
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసింది. గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సీఎస్‌కే, ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని జట్టు 14 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో సీజన్‌ను ముగించింది.
ఈ ఫలితంతో అభిమానుల్లో మరో చర్చ మొదలైంది. అదే ఎంఎస్ ధోనీ భవిష్యత్తు. ఈ సీజన్‌లో కాలి పిక్క, బొటనవేలి గాయాలతో ధోనీ జట్టుకు దూరమయ్యాడు. కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించిన ఆయన, చివరి మ్యాచ్‌కు ముందే ఇంటికి వెళ్లిపోయాడు.
44 ఏళ్ల వయసులో ధోనీ ఆటగాడిగా గతంలోని ఫామ్‌లో లేకపోయినా, మైదానంలో అతడి ఉనికి ఇప్పటికీ ప్రత్యేకమే. ముఖ్యంగా చివరి ఓవర్లలో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం అతడికి ఇప్పటికీ ఉందని అభిమానులు నమ్ముతుంటారు. వచ్చే ఐపీఎల్ నాటికి ధోనీకి 45 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో అతడు మరోసారి సీఎస్‌కే జెర్సీలో కనిపిస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది.
గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, “ఆ విషయం వచ్చే ఏడాదే తెలుస్తుంది. ఈ సీజన్‌లో మేము ధోనీని చాలా మిస్ అయ్యాం. చివరి ఓవర్లలో మ్యాచ్‌ను మార్చగల ఆటగాడు అతడు. అతడి ఉనికి ప్రత్యర్థి జట్టులో ఒత్తిడిని పెంచుతుంది” అని తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ జట్టుకు ప్రతీకగా నిలిచాడు. కెప్టెన్‌గా, ఫినిషర్‌గా, అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. వయసు పెరుగుతున్నా, గాయాలు వెంటాడుతున్నా ధోనీ-చెన్నై అనుబంధం మాత్రం మారలేదు.
“నన్ను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి అయినా సీఎస్‌కే వాళ్లు నాతో ఆడిస్తారు” అని ధోనీ గతంలో చేసిన వ్యాఖ్యలు, అతడికి ఫ్రాంచైజీతో ఉన్న బంధాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.