
కోనసీమ జిల్లాలోని శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ-నూకాలమ్మ-రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవస్థానానికి చెందిన భూములపై ఆక్రమణల అంశాన్ని దేవాదాయ శాఖ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సహాయ కమిషనర్ క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారికి పలు కీలక సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్రమణల్లో ఉన్న భూములను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునే చర్యలను వేగవంతం చేయాలని, మిగిలిన భూమిని కూడా జూన్ 15లోపు తిరిగి దేవస్థానం ఆధీనంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అలాగే మొత్తం భూమిని ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా సర్వే నిర్వహించి, భూముల రికార్డులను స్పష్టంగా సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం 11 సంవత్సరాల లైసెన్స్ హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.