
మంగళగిరి: పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ప్రజల్లో పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక కొందరు వైసీపీ అనుకూల వర్గాలు, మేధావుల ముసుగులో ఉన్న వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాలను విశ్లేషించాల్సిన వారు రాజకీయ పక్షపాతంతో మాట్లాడటం తగదన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలు అధికారాల కోసం కాకుండా ప్రజాసేవ కోసం అని స్పష్టం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, నిజాయితీ అనే విలువలతో ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందన్నారు. ఎవరికైనా అరెస్టులు చేయించడం లేదా రాజకీయ కక్ష సాధింపులు చేయడం జనసేన విధానం కాదని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖకు జాతీయస్థాయిలో 13 అవార్డులు రావడం పవన్ కళ్యాణ్ నాయకత్వానికి నిదర్శనమన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సమస్యల పరిష్కారం, పోలవరం, స్టీల్ ప్లాంట్, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారని, కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని కొనియాడారు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే శాఖాపరమైన సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఆయన బాధ్యతాయుత నాయకత్వానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా యూట్యూబ్ స్టూడియోలలో కూర్చొని కల్పిత కథనాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి రాకముందే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.