
అమలాపురంలో మద్యం తాగి వాహనాలు నడిపిన పది మందిపై స్థానిక స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వీరిని సోమవారం మేజిస్ట్రేట్ చామకూరి నాగేశ్వరరావు ఎదుట హాజరుపరచగా తీర్పు వెలువరించారు.
కోర్టు ప్రతి వ్యక్తికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించడంతో మొత్తం రూ.1 లక్ష అపరాధ రుసుము వసూలు చేయనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం టౌన్ సీఐ వీరబాబు మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.
రోడ్డు భద్రతకు భంగం కలిగించే విధంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని ఆయన వాహనదారులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.