కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి.. సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

కేరళలో పదేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మళ్లీ అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో నిర్వహించిన ఘన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.

సతీశన్‌తో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రివర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, కే. మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్‌లకు చోటు దక్కింది. కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ కూడా కేబినెట్‌లో స్థానం పొందారు. మిత్రపక్షాల నుంచి ఐయూఎంఎల్ నేత పీకే కున్హాలికుట్టి, ఆర్ఎస్పీ నేత షిబు బేబీ జాన్, కేరళ కాంగ్రెస్ నేత మోన్స్ జోసెఫ్, అనూప్ జాకబ్ తదితరులు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

ఈ వేడుకకు వేలాది మంది యూడీఎఫ్ కార్యకర్తలు, అభిమానులు హాజరై సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా, అత్యంత కీలకమైన హోం శాఖను ముఖ్యమంత్రి తన వద్ద ఉంచుకోకుండా సీనియర్ నేత రమేశ్ చెన్నితాలకు అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో సమన్వయం, ఐక్యతకు ఇది సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 106 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు, ప్రధాన మిత్రపక్షానికి 22 స్థానాలు దక్కాయి. మరోవైపు అధికార ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. దేశంలో వామపక్షాల పాలన కొనసాగిన చివరి రాష్ట్రంగా ఉన్న కేరళలో కూడా ఎల్డీఎఫ్ అధికారం కోల్పోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.