
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. “నా దేశం – నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పొదుపు చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన దిగుమతులు, విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగా పొదుపు చర్యలను అమలు చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గించుకోవాలని సూచించారు. అవసరం లేని విదేశీ పర్యటనలను నివారించాలని, వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని కోరారు. సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కార్లకు బదులుగా నడక లేదా సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించారు.
ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’గా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు వీలైనంత వరకు వాహనాల వినియోగాన్ని తగ్గించి, సమావేశాలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని సూచించింది. అధికారులు వాహనాలను షేర్ చేసుకోవడం ద్వారా ఇంధన పొదుపుకు సహకరించాలని కోరారు. ఇకపై ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రజలు కూడా విదేశీ పర్యటనల కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బంగారం కొనుగోళ్లు తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని పేర్కొంది. “స్టెప్ ఫర్ ది నేషన్” పేరుతో నడక, సైకిల్ వినియోగంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఇంధన రంగంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘పీఎం సూర్యఘర్’, ‘కుసుమ్’ వంటి సౌర విద్యుత్ పథకాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.
వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల అధిక వినియోగంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా యూరియా వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాలని సూచించింది. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, డ్రోన్ల సహాయంతో సమానంగా పిచికారీ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రైతులకు సూచించింది.
ఈ చర్యలు ప్రజలను భయపెట్టడానికి కాదని, భవిష్యత్ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాజాన్ని సిద్ధం చేయడానికేనని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రాష్ట్రానికి త్వరలో భారీ పెట్టుబడులు రానున్నాయని, ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.