పొదుపు దిశగా మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు

ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పరిరక్షణ, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రధాని సూచించారు. అయితే ఈ ప్రక్రియలో కొత్త వాహనాల కొనుగోళ్లు చేపట్టవద్దని స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ‘బ్లూ బుక్’ మార్గదర్శకాలకు ఎలాంటి భంగం కలగకుండా ఎస్పీజీ ఇప్పటికే అమలు చర్యలు ప్రారంభించింది.

మోదీ నిర్ణయం ప్రభావంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇదే దారిలో అడుగులు వేస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గించేందుకు సిద్ధమయ్యారు. పరిపాలనలో పొదుపు చర్యలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు.

“ప్రతిదానికీ దిగుమతులపై ఆధారపడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?” అని ప్రశ్నించిన ప్రధాని, స్థానిక ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కూడా దేశభక్తితో సమానమని పేర్కొంటూ, అనవసరమైన బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, వేడుకలను దేశంలోనే నిర్వహించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.