
తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 2026 రాష్ట్ర ఎన్నికల అనంతరం తొలిసారి సమావేశమైన శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచాయి.
“ప్రజలను విడదీసిన సనాతనాన్ని నిర్మూలించాలి” అని ఉదయనిధి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై పలు కోర్టు కేసులను కూడా ఆయన ఎదుర్కొన్నారు.
అయితే ఈసారి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు చట్టపరమైన రక్షణ ఉండే అవకాశముంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం, శాసనసభ్యులు సభలో చేసిన వ్యాఖ్యలకు ప్రత్యేక హక్కులు, మినహాయింపులు కలిగి ఉంటారు. దీంతో కోర్టు కేసుల నుంచి వారికి రక్షణ లభిస్తుంది.
ఇక ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. బీజేపీ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవ్య స్పందిస్తూ.. ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులతో భయపడి, ఇప్పుడు అసెంబ్లీ రక్షణ కవచం వెనుక దాక్కుని మాట్లాడుతున్నారని విమర్శించారు. మరో బీజేపీ నేత నారాయణ్ తిరుపతి మాట్లాడుతూ.. సనాతనంపై చేసిన వ్యాఖ్యలే డీఎంకేకు రాజకీయంగా నష్టం చేశాయని అన్నారు.