
- కోరుమామిడిలో చెరువుల పూడికతీత, డెక్క తొలగింపు పనులకు మంత్రి కందుల దుర్గేష్ శ్రీకారం
- రూ. 81.91 లక్షల వ్యయంతో జలవనరుల అభివృద్ధి పనులు ప్రారంభం..
- యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం లోపే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నిడదవోలు: వ్యవసాయానికి వెన్నెముక వంటి జలవనరులను సంరక్షించి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని జలవనరుల పరిరక్షణ మరియు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో చెరువుల పూడికతీత, కాలువల్లో అడ్డంకిగా మారిన డెక్క (గుర్రపుడెక్క) తొలగింపు పనుల కార్యక్రమానికి ఆయన కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిడదవోలు నియోజకవర్గంలో ఎర్ర కాలువ సెక్షన్ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం రూ. 175.46 లక్షల వ్యయంతో 12 పనులకు ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం రూ. 81.91 లక్షల విలువైన 8 పనులకు అనుమతులు లభించినట్లు తెలిపారు.ఇందులో తాడిమళ్ల ఆవ, గోపన్న చెరువు అభివృద్ధి కోసం రూ. 29.71 లక్షలు, కోరుమామిడి కాలువ, ఎర్ర కాలువ గండి పూడ్చివేత, మేటల తొలగింపు, కల్వర్టు నిర్మాణం కోసం రూ. 42.30 లక్షలు, కంసాలిపాలెం పిల్ల కాలువ, పొలిమేరు కాలువ త్రవ్వకానికి రూ. 9.90 లక్షలు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఈ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు.
జలవనరుల శాఖ ద్వారా నిధులను మంజూరు చేయించడమే కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పనుల నాణ్యతలో రాజీ పడకూడదని మంత్రి దుర్గేష్ అధికారులను హెచ్చరించారు. భూగర్భ జలాల పెరుగుదలకు చెరువుల పూడికతీత ఎంతో కీలకమని, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో కూటమి ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆచరణలో అభివృద్ధిని చూపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా పూడిక పేరుకుపోయి, గుర్రపుడెక్కతో నిండిపోయిన కాలువల వల్ల సాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోందని గుర్తించిన మంత్రి దుర్గేష్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవడంపై నియోజకవర్గ రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.
అనంతరం మంత్రి దుర్గేష్ కోరుమామిడి గ్రామంలో పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న శివాలయాన్ని, కంబాలమ్మ తల్లి గుడి ప్రాంతంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ క్రమంలో వీధిదీపాల సమస్యపై స్థానిక మహిళలు విన్నవించగా మంత్రి దుర్గేష్ తక్షణమే స్పందించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు మరియు ప్రజలు పాల్గొని మంత్రి దుర్గేష్ చొరవను అభినందించారు.