ఎక్కడి పొగాకు అక్కడే!

 పరిమితంగా కొనుగోళ్లు – పేరుకుపోయిన బేళ్లు
*నేటికీ తొలి రౌండు పూర్తి చేయని వ్యాపారులు
*తగ్గుతున్న ధరలతో రైతుల ఆందోళన
*శీతల గిడ్డంగుల్లో పెరిగిన అద్దెలు

పొగాకు సాగు చేసిన రైతుకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. పొగాకు పంట రైతు చేతికి వచ్చి మూడు నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు వేగం పుంజుకోలేదు. ప్రకాశం జిల్లాలోని వందల గ్రామాల్లో జనవరి నాటికే పొగాకు క్యూరింగ్ పూర్తి చేసి రైతులు అమ్మకానికి సిద్దం చేశారు. జనవరి చివరి వారంలో వేలం ప్రారంభించి వంద రోజుల్లో పూర్తి చేయాలి. కానీ పొగాకు బోర్డు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎట్టకేలకు మార్చి 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినా రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేస్తున్నారు. కర్ణాటకలో కొనుగోళ్లు పూర్తి కాలేదని అందుకే ఒంగోలుకు వ్యాపారులు రాలేదని అధికారులు సాకులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులకు కూడా పొగాకు రైతుల గోడు పట్టడం లేదు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పొగాకు రైతుల సమస్యలను ఇంకా పట్టించుకోలేదు. పొగాకు ధరలు తగ్గిపోతున్నా, వ్యాపారులతో కనీసం చర్చలు కూడా జరపలేదు. దీంతో రైతులు చేసేది లేక పొగాకు బేళ్లను శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు.
*ఇదీ పరిస్థితి
ప్రకాశం జిల్లా టంగుటూరు వేలం కేంద్రం పరిధిలో 12 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ లో రెండు, మూడు గ్రామాలు వున్నాయి. ప్రతి రౌండులో మొత్తం గ్రామాల్లో పొగాకు కొనుగోలు చేయాలి. ఇలా మొత్తం 8 రౌండ్లు పూర్తి చేయాలి. తొలి రౌండులో రెండు క్లస్టర్లలో ఒక్కో రైతు నుంచి 2 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మిలిగిన 10 క్లస్టర్ల రైతులకు ఎప్పుడు తొలి విడత అవకాశం దక్కుతుందో తెలియడం లేదు. మొత్తం రౌండ్లు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా అంతుపట్టడం లేదు. ఇక ఒంగోలు 2 వేలం కేంద్రం పరిధిలో 45 గ్రామాలున్నాయి. 13 గ్రామాల్లో రైతుల నుంచి మొదటి రౌండులో 2 బేళ్లు చొప్పున కొనుగోలు చేశారు. మిగిలిన 32 గ్రామాల నుంచి ఇంకా పొగాకు కొనుగోలు చేయలేదు. తొలి రౌండు ఇంత వరకు పూర్తి కాలేదు. మొత్తం పొగాకు విక్రయించుకునేందుకు ఎంత సమయం పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
*కర్ణాటక, ఏపీలో ఏకకాలంలో కొనుగోళ్లు చేయరా?
కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎందుకు ఎదురు చూడాలి? కర్ణాటకలో 140 రోజుల పాటు కొనుగోళ్లు చేస్తున్నారు. మే చివరి వరకూ పొగాకు వేలం జరుగుతుంది. అంటే అప్పటి వరకు వ్యాపారులు ఏపీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఐటీసీ, జేపీ, మరికొన్ని సంస్థలు ఏపీలో కొనుగోళ్లు ప్రారంభించినా గల్ప్ యుద్ధం బూచిగా చూపి ధరల్లో కోత వేస్తున్నారు. వ్యాపారులు ఎక్కువ మంది కొనుగోళ్లకు వస్తే పోటీ పెరిగి రైతుకు మంచి ధర దక్కే అవకాశముంది. కానీ అసలు కొనుగోళ్లే సరిగా ప్రారంభం కాకపోవడం పొగాకు రైతును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు పంటకు కేంద్రం అనుమతించింది. అదనంగా మరో 87 మి.కిలోల దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటి వరకు వ్యాపారులు కేవలం 16 మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కిలోకు సగటున రూ.247.87 ధర లభించింది. బ్రైట్ రకానికి కనీసం రూ.320 లభిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. దీనికి సగటున కిలోకు రూ.240 ధర దక్కుతోంది. పైగా రైతులు తెచ్చిన పొగాకును పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారు. గోపాలపురం కేంద్రంలో 43 శాతం, కొయ్యలగూడెంలో 44 శాతం బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయకుండా తిరస్కరించారు.
*పెరిగిపోయిన ఖర్చులు
పొగాకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. జనవరిలో పొగాకు కొనుగోళ్లు మొదలుపెట్టి ఆగష్టు నాటికి పూర్తి చేసేవారు. కొంత కాలంగా మార్చిలో వేలం ప్రారంభించి డిసెంబరు వరకు కొనసాగిస్తున్నారు. దీంతో రైతులు ఎక్కువ కాలం నిల్వ చేయాల్సి వస్తోంది. పెరిగిన ఎండ వేడితో పొగాకు నాణ్యత తగ్గుతోంది. దీంతో రైతులు పొగాకును శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఒక్కో బేలు అద్దె ఆరు నెలలకు రూ.500 ఉండగా నేడు అది రూ.1000కి పెంచారు. దీంతో రైతులపై పెను భారం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.